Monday, December 21, 2009

వీడ్కోలు

ఇంకొక పది రోజులలో ఈ ఏడాది కి వీడ్కోలు చెప్పె సమయం ఆసన్నమైంది.
మనం సాధించినదేమిటి ? మన విజయాలు , వైఫల్యాలు ..........
పొందిన స్నేహాలు ఎన్ని ?
అత్యంత ఆనందానికి లోను చేసిన సన్నివేశాలేమిటి ? విషాదానికి లోను చేసిన సందర్భాలు ఒక్కసారి అవలోకించండి.

వీటి గురించి ఒక నోట్ బుక్ లోనో, డైరీ లోనో ఈ డిసెంబర్ చలి రాత్రుల్లో ఏకాంతంగా కూర్చుని గతాన్ని అది ఇచ్చిన అనుభవాలు రాయండి.
ఇది మున్ముందు కాలాన్ని మరింత సుందరంగా మలచుకోవడం నేర్పుతుంది. కాలం విలువ తెలుస్తుంది.

Friday, December 4, 2009

గీతాంజలి

శీతల పవన స్పర్శకి స్వల్ప కంపనంతో
రెల్లు వెన్నెలలో సంగీత స్వరాన్ని
ఆలపించినట్లు ఈ నా శూన్య హృదయం
వలపిస్తే శిలలు కూడా అశ్రువులు కారుస్తాయి.

రవీంద్రుని గీతాంజలి ఎన్ని సార్లు చదివినా కొత్తగానే ఉంటుంది. మనసుని కదిలిస్తుంది.

Wednesday, November 25, 2009

నువ్వు

అస్తమాను తల వంచుకొని
భూమిలో ఏం వెతుకుంటావు
అదిగో ఆకాశం ఎన్నెన్ని అందాలు
సంతరించు కుంటుందో ఆసక్తిగా చూడమన్నావు
నవ్వటం నేర్పావు
నలుగురిలో ధైర్యంగా నడవటం నేర్పావు.

Monday, November 23, 2009

నీ కోసం

నీ చిన్ని నవ్వు కోసం
రవ్వంత ప్రేమ కోసం
నీ మనసు ముంగిట పడిగాపులు కాసాను
నిరంతరం నిరీక్షణ అనుక్షణం నీ ఆలోచన
నీ జ్ఞాపకం జాజిపూల సువాసనలని మోసుకొస్తుంది
నా మనసుని మెత్తగా హత్తుకొంటుంది.

Saturday, November 21, 2009

జీవితం

బాల్యమంతా నేర్చుకోవడమే మాటలు, ఆటలు, నవ్వులు, చేష్టలు. పడతాం, లేస్తాం, నడుస్తాం. దాన్ని శిక్షగానో ఎవరో పెట్టిన పరీక్ష గానో భావించం. నడక రాగానే పరుగెత్తడం, గెంతడం, ఎక్కడం ఇష్టాలను బట్టి సైకిలు లేకపోతె ఈత కొట్టడం నేర్చుకొంటాం. అనుకొన్నది సాధించేదాకా వదిలిపెట్టం.స్కూల్లో , కాలేజిలో చదువుతోపాటు ఆటల్లో, పాటల్లో ఆసక్తిని పెంచు కొంటాం. ఏది కష్టం అనిపించదు. అంతేకాక ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మనం ఏదో సాధించామన్న తృప్తి ఉంటుంది.

అప్పుడు లేని భయం పిరికితనం మనం స్వతంత్రంగా బతకవలసి వచ్చి నప్పుడు నిర్ణయాలు తీసుకోవలసి వచ్చి నప్పుడు తెగ ఆలోచిస్తాం, బుర్ర బద్దలుకొట్టుకొంటాం . ఎదుటివారితో పోటిపడకుండా వాళ్ళలో నేర్చుకోవలసిన అంశాలు చూడకుండా వాళ్ళకేదో ఉంది అందుకే త్వరగా కీర్తిని, డబ్బుని సంపాదిస్తున్నారని బెంగ పడతాం.

చిన్నతనం లో మనం ఎంత మంది ఉన్నా మనకు నచ్చిన మాటలు బెదురులేకుండా , తప్పులున్న పట్టించుకొనే వాళ్ళం కాదు. పైగా మనదే కరెక్ట్ అని వాదించే వాళ్ళం.మరి పెద్ద అయ్యాక మన ఉద్యోగాల్లో పదిమంది ముందు మాట్లాడానికి కంగారు పడతాం. సమూహం చూడగానే కాళ్ళు చేతులు చెమట పట్టి వణుకుతాయి. అప్పుడు తెలుసుకోవాలన్న తపన. ఇప్పుడు అన్ని వచ్చు అనే అహంభావం. ఏమి రావడం లేదు అన్నా నిరాసక్త. ఎందుకు ఇలా ... అప్పటిలానే హాయిగా , ఆనందంగా, నవ్వుతు, నేర్చుకొంటూ, నేర్పుతూ నిరంతరం కొత్తగా ఉండచ్చు కదా!

కొత్తగా ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు వెనకడుగు వేస్తాం, తడబడటం ఎందుకు! చేసే ప్రతి పని లోను ఒక అవకాశం దాగుందని గుర్తించగలిగితే సమస్యలు సమస్యల్లా అనిపించవు.

జీవితమంటే చిన్న చిన్న ఆనందాలు, అనుభూతులు, స్వచమైన చిరునవ్వు. అప్పుడు ప్రతి రోజు శుభోదయమే.

Friday, November 20, 2009

స్నేహం

ఏ విషయమైన కొత్తగా ఉన్నప్పుడే బాగుంటుంది కానీ , స్నేహం మాత్రం పాతబడిన కొద్ది బాగుంటుంది. చెలిమికి ఉన్న సుగుణం . చిరకాలం నిలిచే వసంతం. ప్రయోజనాలతో స్నేహం ముడిపడి ఉండదు. ఒక వేళ దగ్గరైన ప్రయోజనాలు నెరవేరక దూరం జరుగుతారు. కానీ స్నేహం ఇచ్చిపుచ్చు కోవడాలు కన్నా అతీతమైనది.

స్నేహం చేయడానికి తర్ఫీదు ఉండదు. శిక్షణ కోర్సులు ఉండవు. స్నేహంగా ఉండాలన్న తపన ఉండాలి. ఎదుటి వాళ్ళు చెప్పింది వినగలిగే ఓర్పు ఉండాలి. మనసులో మాట చెప్పుకోగలగాలి. అలాంటప్పుడే స్నేహం ఎదుగుతుంది.
ఏదైనా పని ఉంటే తప్ప పలకరింపులు లేని ప్రపంచంలో స్నేహం అంత సులువు కాదు. కరుణ , మనుషులను అర్ధం చేసుకోగలిగే ఓర్పు, క్షమా గుణం ఉండాలి.

ఎదుటి మనిషి లో లోపాలు ఎంచడం కాకుండా ఆ మనిషి అలాఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోగలిగే సహనం ఉండాలి. ఇలాంటివారు ఇతరులపట్ల సున్నిత హృదయంతో స్పందిస్తారు. ఇది స్నేహానికి అవసరమైన లక్షణం. ఇంతటి ఉదాత్త ఇద్దరి మధ్య ఉన్నప్పుడు ఆ చెలిమి అపూర్వం.

Sunday, October 4, 2009

ఆశ

మంద్రంగా - శీతాకాలపు సాయంత్రాలలో వీచే చల్లని గాలుల్లా , శరద్రాత్రులలోని లేత వెన్నెలవలె, ప్రాతః కాలపు పిల్ల తెమ్మెరలా, ఆకాశంలో ఎగిరే పక్షిలా, మంచులో తడిసిన గులాబీ పువ్వులా, చీకటిలో ఎగిరే మిణుగురు పురుగులా, చెట్ల కొమ్మల మధ్య నుంచి కూసే పిట్టలా, అర్ధరాత్రి తోట మధ్యలోని నిశబ్ద సంగీతంలా మారిపోవాలని ఆశ.

Saturday, October 3, 2009

కలలు

క్రమశిక్షణ , ఆశ వున్నప్పుడు మనసు మిత్రునిలా సహాయం చేస్తుంది.
నిరాశకు లోనైన మనసు శత్రువులా వ్యవహరించి జీవితాన్ని నాశనం చేస్తుంది.
గుండెలోతుల నుంచి ఆలోచించేవారికి లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. పైపైన ఆలోచించేవారు కలలు మాత్రమే కంటారు. తరచి చుడగాలిగినవారు మేల్కొని వాటిని నిజం చేసుకొంటారు.

చదువు ఒక్కటే పరమార్ధం కాదు. పరిశీలన, తార్కికత, నిబద్దత, పట్టుదల, క్రమశిక్షణ వుండాలి. అప్పుడే పైకి రావడానికి అవకాశంతో పాటు విజయం వరిస్తుంది.
ఎప్పుడైతే క్రమశిక్షణ , కృషి సమపంధలో ఉంటాయో అప్పుడు మన గమ్యం సాధిస్తాం. మన ఆశయదిరోహణలో ఒక క్రొత్త ఒరవడిని సృష్టిస్తాం.
ఎప్పుడు చలాకీగా, హుషారుగా వుండేవారు నిరాశ నిసృహలకి దూరంగా వుంటారు.

ఒకసారి మన కలలు నిజమైపోయాక చుట్టూ ప్రపంచాన్ని జాగ్రత్తగా గమనించాలి. మన ఆలోచనలని ఎప్పటికప్పుడు పదును పెట్టాలి. చేసే పని సృజనాత్మకంగా కనిపించాలి, వుండాలి. అన్ని సాధించేసాను అని అనుకొంటే అక్కడితో మనం ఆగిపోతాం . నిరంతర సాధన మనకి కీర్తికిరీటాలు సంపాదించి పెడుతుంది.

Friday, October 2, 2009

ఉత్తరం

ఒక మిత్రుడో/ మిత్రురాలో ఉత్తరం రాస్తే అది చేరడానికి కొన్ని రోజులు, తిరిగి మనం ఒకొక్క వాక్యమే పేర్చుకొంటూ జాబు రాస్తే మరికొన్ని రోజుల్లో వాళ్ళకందేవి.

మళ్లీ ఉత్తరం కోసం ఎదురుచూడడం అందులో మనకోసం అమరిన అక్షరాలు , మనల్ని ఉద్దేశించిన భాష , మనం లక్ష్యం గా సాగిన భావన ఎంత వింతైన అనుభుతిలిస్తాయోకదా !

పాతవి అప్పుడప్పుడు చడువుకోవడంలో ఎంత ఆనందం ఉండేది.
ఇప్పుడు అంతా ఫోనులూ, దాని నుండే సందేశాలు. ఎదురు చూడడం లేదు. సమయం లేదంటూ చాలా కోల్పోతున్నాం.



Tuesday, September 15, 2009

మానవ సంబంధాలు

మన వల్ల పొరపాటు జరిగినప్పుడు క్షమించమని అడగటం , మరొకరి వల్ల మనం మేలు పొందినప్పుడు కృతఙ్ఞతలు చెప్పడం కద్దు.

మనం థాంక్స్ , సారీ అలవాటు చేసుకోన్నాం. భాష ఏమిటన్నది మనసులో పెట్టుకోకుండా భావాన్ని వ్యక్తం చేయడం వల్ల మానవ సంబంధాలు మెరుగు పర్చుకోన్నవాళ్ళం అవుతాం . ఇందులో ఏమాత్రం సందేహం లేదు.

థాంక్స్, సారీ అన్న రెండు పదాలు ఎంత శక్తివంతమైనవో ఎంతోమందికి తెలీదు. అంతే కాదు మానవ సంబంధాలు మెరుగు పరచడంలో ఈ రెండు పదాలు చాల దోహదపడతాయి.

Sunday, September 6, 2009

మాట్లాడం ఒక కళ

కొంతమంది మాట్లాడుతుంటే ఎంత సేపు విన్న తనివి తీరదు. వారి మాటలు ఇంకా ఇంకా వినాలనిపించేంత ఆసక్తికరంగా, మధురంగా ఉంటాయి. చక్కని పదాలు ఉపయోగించడం , సులువైన వాక్య నిర్మాణం , సరైన ఉచ్చారణ కలిగి ఉండటం వీరి ప్రత్యేకత.

భాష మీద పట్టు , మాట్లాడుతున్న అంశంపై అవగాహన, ఆకట్టుకొనేలా మాట్లాడే తీరు చూసి ఎదుటి వ్యక్తులు ముచ్చట పడతారు.

వీరి మాట్లాడే తీరు గురుతుకొచినప్పుడు అసంకల్పితంగా చిరునవ్వు కదులుతుంది.

ఆసక్తికరంగా , వినసొంపుగా మాట్లాడం ఒక కళ . కొందరికి స్వతః సిద్దంగా వస్తే మరి కొందరికి సాధనతో అలవరచుకొంటారు.

మనం అలా మాట్లాడలేకపోతున్నందుకు బాధ పడతాం. కానీ కొంచెం సాధన చేస్తే మనం కూడా అలా మాట్లాడవచ్చు . సహనంతో వ్యవహరించడం, ఆలోచనలలో సమయస్పూర్తి కలిగి ఉండటం, వివరించడంలో స్పష్టత , విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం , భాష మీద పట్టు సాధించడం , కంఠధ్వని మెరుగుపరచుకోవడం వల్ల వినసొంపుగా మాట్లాడవచ్చు.

Sunday, August 30, 2009

గులాబీ

ఆకు పచ్చ ఆకుల మధ్య హుందాగా ఆందంగా ఉంటుంది గులాబీపువ్వు. కానీ ఒంటరిది. ఇతరులకి మానసికానందాన్ని ఇస్తుంది. మనకి అర్ధం చేసుకోగల శక్తి ఉంటే దాని మౌన భాష లో చాల విషయాలు చెబుతుంది.

మనం ఎవరికైనా శుభాకాంక్షలు చెప్పడానికి , అబినందనలు తెలుపడానికి ఒక గులాబీ గుత్తి ఇస్తాం . అది అందుకొన్న వారు ఒక్క క్షణం తదేకంగా దానిని చూసి చిరునవ్వు తో మనని పలకరిస్తారు . ఇష్టపడే వాళ్ళైతే ఆ పువ్వులు చెప్పే ఊసులు నిశ్శబ్దం గా విని ఆనందిస్తారు.

Saturday, August 29, 2009

వర్షం

కమ్ముకొచ్చేమబ్బులు , కురవాల వద్దా అని మేఘాలు ఆడే దోబూచి ఆటలు, ఒక చినుకు తో వర్షం మొదలవుతుంది. వర్షం తో వచ్చే మట్టి వాసన, కిటికిలోంచి ఆకాశం చూస్తుంటే ధారలుగా కురిసే జల్లు , చిన్నపుడు ఆ వానలో కాగితాలతో పడవలు చేసి ఆడుకొన్న ఆటలు, వాన వాన వల్లప్ప అంటు తడిసి తర్వాత జలుబు చేస్తే అమ్మ మెత్తని మందలింపులు , చినుకులు ఆకులపై రాలి ముత్యాల్లా మెరుస్తుంటే వింతగా చూడడం ఏదో కొత్త విషయం కనుకోన్నట్లు , చేలల్లో రైతులు నాట్లు పెడుతూ ఆనందంతో పాడే పల్లె పాటలు వర్షగమనంతో మా పల్లె పచ్చని అందాలు సంతరించుకొంటుంది.

Thursday, August 27, 2009

ప్రేమ

ప్రేమ రెండు అక్షరాలే అయినా దాని వెనుక నిశబ్దం ఉంది. వేదన ఉంది . తపన ఉంది. అంతే స్థాయి లో ఆత్మీయత , ఆనందం ఉద్వేగం కూడా ఉంటుంది.

Tuesday, August 18, 2009

నీ జ్ఞాపకం

కొబ్బరాకుల మద్య వచ్చే చారల చారల వెన్నెల, ప్రక్కన ప్రవహించే ఏటి గట్టు గలగలలు , దూరంగా చేలల్లో ఎవరో పాడే పాట, చీకటి రాత్రులలో నల్లని చుక్కల చీర ధరించే వినీలాకాసం ,వెల్లకిలా పడుకొని ఆకాశాన్ని వీక్షిచడం ----------------------- నీ జ్ఞాపకం జాజిపూవులా గుబాలిస్తూనే ఉంటుంది