Sunday, May 9, 2010

అమ్మ

అమ్మ అంటే
నీ కంటూ అస్తిత్వం లేనప్పుడు కూడా నిన్ను కోరుకొంది. నువ్వు ఎలా ఉంటావో తెలియకపోయినా ప్రేమించింది.
నువ్వు కనిపించటానికి గంట ముందునుంచి నీ కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధపడింది. నువ్వు నోరు విప్పి చెప్పలేనప్పుడు ని భాష అర్ధం చేసుకొని నిన్ను సాకింది. నీ చిరునవ్వు ఒక వరంలా భావించి పొంగిపోయింది. నువ్వు చలికి వణుకుతుంటే వెచ్చని దుప్పటి కప్పి , నీకు కాస్త అనారోగ్యం చేస్తే తన నిద్ర మానుకొని నిన్ను చూస్తూ తెల్లవార్లూ జాగారం చేసేది. నీ నువ్వు ముఖం చూసి సంతృప్తి పొందేది.
నీకు గోరుముద్దలుతినిపించి , నీ తప్పటడుగులు నుంచి నడక నేర్పించి ఒక గురువులా అన్ని విషయాలలో తర్ఫీదు ఇచ్చి నువ్వు జీవితం లో గెలిచి నప్పుడల్లా తన గెలుపులా భావించి అదే పండగలా అనుకొంది.
వేసవి సెలవలకి అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం ఒక మధురను భూతి . అమ్మమ్మ, తాతయ్య, మామయ్యలు, పిన్నిలు అమ్మ ఆస్తిపాస్తులు. ఎవరిని కదిలించిన అమ్మ జ్ఞాపకాల దొంతర. అమ్మ చిన్నతనం , ఇరుగు పొరుగు అమ్మ గురించి చెప్పే మాటలు ఒక్క పదం కూడా జారిపోకుండా జాగ్రత్తగా మనసులో భద్రపరుస్తాం.
అమ్మ అనే పదం లో అందం, ఆనందం , కమ్మదనం , తీయదనం రంగరించి ఉన్నాయి. అమ్మ ప్రేమకు మారు పేరు.
అమ్మ గురించి ఎంత చెప్పిన తరగదు.