Sunday, October 4, 2009

ఆశ

మంద్రంగా - శీతాకాలపు సాయంత్రాలలో వీచే చల్లని గాలుల్లా , శరద్రాత్రులలోని లేత వెన్నెలవలె, ప్రాతః కాలపు పిల్ల తెమ్మెరలా, ఆకాశంలో ఎగిరే పక్షిలా, మంచులో తడిసిన గులాబీ పువ్వులా, చీకటిలో ఎగిరే మిణుగురు పురుగులా, చెట్ల కొమ్మల మధ్య నుంచి కూసే పిట్టలా, అర్ధరాత్రి తోట మధ్యలోని నిశబ్ద సంగీతంలా మారిపోవాలని ఆశ.

Saturday, October 3, 2009

కలలు

క్రమశిక్షణ , ఆశ వున్నప్పుడు మనసు మిత్రునిలా సహాయం చేస్తుంది.
నిరాశకు లోనైన మనసు శత్రువులా వ్యవహరించి జీవితాన్ని నాశనం చేస్తుంది.
గుండెలోతుల నుంచి ఆలోచించేవారికి లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. పైపైన ఆలోచించేవారు కలలు మాత్రమే కంటారు. తరచి చుడగాలిగినవారు మేల్కొని వాటిని నిజం చేసుకొంటారు.

చదువు ఒక్కటే పరమార్ధం కాదు. పరిశీలన, తార్కికత, నిబద్దత, పట్టుదల, క్రమశిక్షణ వుండాలి. అప్పుడే పైకి రావడానికి అవకాశంతో పాటు విజయం వరిస్తుంది.
ఎప్పుడైతే క్రమశిక్షణ , కృషి సమపంధలో ఉంటాయో అప్పుడు మన గమ్యం సాధిస్తాం. మన ఆశయదిరోహణలో ఒక క్రొత్త ఒరవడిని సృష్టిస్తాం.
ఎప్పుడు చలాకీగా, హుషారుగా వుండేవారు నిరాశ నిసృహలకి దూరంగా వుంటారు.

ఒకసారి మన కలలు నిజమైపోయాక చుట్టూ ప్రపంచాన్ని జాగ్రత్తగా గమనించాలి. మన ఆలోచనలని ఎప్పటికప్పుడు పదును పెట్టాలి. చేసే పని సృజనాత్మకంగా కనిపించాలి, వుండాలి. అన్ని సాధించేసాను అని అనుకొంటే అక్కడితో మనం ఆగిపోతాం . నిరంతర సాధన మనకి కీర్తికిరీటాలు సంపాదించి పెడుతుంది.

Friday, October 2, 2009

ఉత్తరం

ఒక మిత్రుడో/ మిత్రురాలో ఉత్తరం రాస్తే అది చేరడానికి కొన్ని రోజులు, తిరిగి మనం ఒకొక్క వాక్యమే పేర్చుకొంటూ జాబు రాస్తే మరికొన్ని రోజుల్లో వాళ్ళకందేవి.

మళ్లీ ఉత్తరం కోసం ఎదురుచూడడం అందులో మనకోసం అమరిన అక్షరాలు , మనల్ని ఉద్దేశించిన భాష , మనం లక్ష్యం గా సాగిన భావన ఎంత వింతైన అనుభుతిలిస్తాయోకదా !

పాతవి అప్పుడప్పుడు చడువుకోవడంలో ఎంత ఆనందం ఉండేది.
ఇప్పుడు అంతా ఫోనులూ, దాని నుండే సందేశాలు. ఎదురు చూడడం లేదు. సమయం లేదంటూ చాలా కోల్పోతున్నాం.