Sunday, May 9, 2010

అమ్మ

అమ్మ అంటే
నీ కంటూ అస్తిత్వం లేనప్పుడు కూడా నిన్ను కోరుకొంది. నువ్వు ఎలా ఉంటావో తెలియకపోయినా ప్రేమించింది.
నువ్వు కనిపించటానికి గంట ముందునుంచి నీ కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధపడింది. నువ్వు నోరు విప్పి చెప్పలేనప్పుడు ని భాష అర్ధం చేసుకొని నిన్ను సాకింది. నీ చిరునవ్వు ఒక వరంలా భావించి పొంగిపోయింది. నువ్వు చలికి వణుకుతుంటే వెచ్చని దుప్పటి కప్పి , నీకు కాస్త అనారోగ్యం చేస్తే తన నిద్ర మానుకొని నిన్ను చూస్తూ తెల్లవార్లూ జాగారం చేసేది. నీ నువ్వు ముఖం చూసి సంతృప్తి పొందేది.
నీకు గోరుముద్దలుతినిపించి , నీ తప్పటడుగులు నుంచి నడక నేర్పించి ఒక గురువులా అన్ని విషయాలలో తర్ఫీదు ఇచ్చి నువ్వు జీవితం లో గెలిచి నప్పుడల్లా తన గెలుపులా భావించి అదే పండగలా అనుకొంది.
వేసవి సెలవలకి అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం ఒక మధురను భూతి . అమ్మమ్మ, తాతయ్య, మామయ్యలు, పిన్నిలు అమ్మ ఆస్తిపాస్తులు. ఎవరిని కదిలించిన అమ్మ జ్ఞాపకాల దొంతర. అమ్మ చిన్నతనం , ఇరుగు పొరుగు అమ్మ గురించి చెప్పే మాటలు ఒక్క పదం కూడా జారిపోకుండా జాగ్రత్తగా మనసులో భద్రపరుస్తాం.
అమ్మ అనే పదం లో అందం, ఆనందం , కమ్మదనం , తీయదనం రంగరించి ఉన్నాయి. అమ్మ ప్రేమకు మారు పేరు.
అమ్మ గురించి ఎంత చెప్పిన తరగదు.

Sunday, March 14, 2010

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

అన్నమయ్య లక్ష గళార్చన లో పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ మనం సాధించిన సందర్భం లో వాళ్ళు ఇచ్చిన ప్రశంస పత్రం .

Thursday, February 4, 2010

జ్ఞాపకం

నీ జ్ఞాపకాలు నీలి మేఘల్లా కదలిపోతున్నాయి
గుబులు తెరలై అవి మనసంత ఆవరించి
మళ్లీ అవే వానచినుకులై నా మనసును
మయూర నాట్యం చేయిస్తున్నాయి

చల్లగాలి నీ చిరునవ్వును జ్ఞాపకం చేస్తోంది
నైట్ క్వీన్ సువాసనలు మైమరపిస్తున్నాయి

Monday, February 1, 2010

ప్రేమ

ప్రేమంటే మానసిక భావన. ఒక వ్యక్తిని ప్రేమిస్తే వారి హెచ్చుతగ్గుల్ని బట్టి ప్రేమ మారదు. నిజంగా ప్రేమిస్తే వాళ్ళ కళ్ళలోనూ, ముఖంలోనూ సంతోషం తుళ్ళి పడుతుంది. ప్రేమలోని ప్రకంపనలు వాళ్ళున్న చోటంత వ్యాపిస్తాయి.

ప్రేమలో బంధం తీయగా ఉండాలంటే అక్కడ ఆదాయానికి సంబంధించినవేమి ఉండకూడదు.ఎదుటి వారి నుండి ఏ లాభం పొందగలమా అని ఆలోచిస్తే ఆ క్షణం ప్రేమ పోతుంది.

ప్రేమ నిజంగా ఉంటె సుఖంగా ప్రయాణం చేయ వచ్చు.

Saturday, January 30, 2010

స్నేహం

స్నేహానికి పునాది పరిచయాలే. ఏ వ్యక్తి అయిన ముందు పరిచయం అయిన తరువాతే స్నేహితులుగా మారతారు.
చిన్ననాటి స్నేహితులు, కాలేజీల్లో ఎదిగిన స్నేహాలు ఒక ఎత్తు. మన నిత్య జీవితంలో ఎదురయే నేస్తాలంతా మరో ఎత్తు.
అక్కడక్కడ తారసపడుతూ మధురమైన అనుభూతులు పంచుతారు. వయస్సు నిమిత్తం లేదు, అభిరుచులు కలవాలనే రూలు లేదు. జీవితం అనే ప్రయాణంలో ఎందరో వస్తు వెళుతూ ఉంటారు. ఒక్కోసారి మంచి మిత్రులను పరిచయం చేస్తుంది. కొన్ని పరిచయాలు విడదీయ లేనివిగా మారతాయి.

నవ్వుతు నవ్విస్తూ ఉన్నవారి చుట్టూ స్నేహితులు ఉంటారు. చిరునవ్వు తో పలకరించడం ఒక కళ. చుట్టూ పక్కల వాళ్లతో , పనిచేస్తున్న చోట కాస్త చతురత తో , ఆహ్లాదకర సంభాషణలు చేస్తే వారికీ మనని దగ్గర చేసి మనం కొన్ని రోజులు కలవలేక పొతే వాళ్ళు మన గురించి ఎదురుచుసేలా చేస్తాయి. అటువంటి స్నేహం పొందడం మన అదృష్టం.

సృష్టిలో తీయనైనది స్నేహ బంధం. మనం ఎవ్వరితోను చెప్పుకోలేని విషయాలు స్నేహితునితో/స్నేహితురాలితో చెప్పుకొని ఉరట పొందవచ్చు. ఒక్కోసారి వాళ్ళ సలహాలు మన జీవితాన్ని మార్చవచ్చు. మన ఉన్నతికి కారణం అవ్వచ్చు.

ఒక కవి అన్నట్లు స్నేహం లేని జీవితం పూలు లేని తోట వంటిది.

Tuesday, January 26, 2010

విలువ

ఒక వారం విలువ తెలియాలంటే - వార పత్రిక సంపాదకుడి నడగాలి .
ఒక గంట విలువ తెలియాలంటే - ప్రేయసి కోసం తహ తహలాడే ప్రేమికుడి నడగాలి .
ఒక నిమిషం విలువ తెలియాలంటే - రైలు బండి మిస్సయిన పెద్ద మనిషి నడగాలి.
ఒక క్షణం విలువ తెలియాలంటే - తృటిలో పెద్ద ప్రమాదం నుండి బయటపడిన అదృష్టవంతుని అడగాలి.
ఒక సుక్ష్మతి సూక్ష్మమైన విలువ తెలియాలంటే - ఒలింపిక్స్ లో రజిత పతకం గెలుచుకొన్న క్రీడాకారుని అడగాలి.

Sunday, January 24, 2010

కన్నీరు

భావోద్వేగాల కలబోత లో ఒక్కోసారి అసంకల్పితంగా మనుషులు కన్నీరు జారవిడుస్తారు .
దుఖం , దిగులు, బాధ , వేదన వంటి సందర్భాల్లోనే కాక ఆనందం ఎక్కువైనా కళ్ళు సజల నేత్రలవుతాయి.
జ్ఞాపకాలు, కలలు, ఎవరో తలపు కొచ్చినపుడు కళ్ళు చెమ్మగిల్లి, గుండె ఆర్ద్రమై పోతుంది. కొంతమంది ధైర్యంగా వున్నట్లు కనిపిస్తారు. కాని అత్మీయుడైన మిత్రుడు ముందు జ్ఞాపకాల్ని కలబోసుకొంటూ తెలియకుండానే కన్నీరు పెట్టుకొంటారు. ఎందుకంటే కన్నీళ్ళు స్వచ్చమైనవి.

Sunday, January 17, 2010

మార్పు

మార్పు అనేది సహజం. పరిస్తితులు , స్తితి గతుల బట్టి మార్పులోస్తూ ఉంటాయి. అకస్మాత్తుగా ఆర్ధిక పరిస్తితులలో మార్పులు సంభవించినపుడు చికాకు కలగవచ్చు, స్నేహాల్లో బంధుత్వాల్లో తేడ రావచ్చు.

మార్పు తమ జీవనాన్ని మరింత మెరుగుపరుస్తుందని భావించి ఆహ్వానిస్తే ఆనందం. మార్పు నిరంతరం చోటు చేసుకొనే ప్రక్రియ. దీనివల్ల సృజనాత్మకత పెరిగి మనస్సు భిన్న మార్గాలలో ఆలోచిస్తూ చైతన్యం పొందుతుంది. లక్ష్య సాధనకు మార్పు తప్పనిసరి.

సాంకేతిక విజ్ఞానంలో , ఆలోచన విధానంలో మార్పు రావచ్చు. వీటిని మనం అంగీకరించాలి. లేకపోతే ఒత్తిడే కలుగుతుంది.

నులి వెచ్చని సూర్య కిరణాలూ ఆకు పచ్చని గడ్డి ఆమోదించినట్టుగానే మనం కూడా మార్పు ను ఆహ్వానించాలి.

కొన్ని సమయాల్లో మార్పు కష్టంగా, గందర గోళంగా అనిపించవచ్చు. సమస్యలను ఓర్పుతో పరిష్కరించుకొనే శక్తి అవకాశం ఉంటాయి. ప్రశాంతంగా ఆలోచనలని, ప్రాధాన్యత క్రమాన్ని చూసుకోవాలి. మార్పు వల్ల జీవితం ఎంతో ఆనందంగా ఉందని గ్రహిస్తాం.

మార్పు సుదీర్ఘంగా ప్రయాణం చేస్తే అలసట అనిపించి మనసు మొరాయిస్తుంది. తరువాత మార్పు కొత్తదనంతో, ఆనందంతో ఉరకలు వేస్తుంది.

Tuesday, January 12, 2010

సంక్రాంతి

తెలుగు వారి పండగల్లో విశిష్టమైనది సంక్రాంతి.
శ్రామిక జీవన సంస్కృతి లోంచి , పాడిపంటల సౌభాగ్యం లోంచి ఆవిర్భవించిన పండగ యిది.
హేమంతం లోని చల్ల చల్లని గాలులు తనువును సృసిస్తుండగా , ప్రాతః కాలంలో కురిసే మంచు జల్లులు, పచ్చని పచ్చికపై పడి ముత్యాల్లా మెరుస్తున్న మంచుబిందువులు ఈ సుందర వాతావరణం లో వచ్చేది ధనుర్మాసం.
ఈ ధనుర్మాసం చివరి మూడు రోజులు సంక్రాంతి పండుగగా జరుపుకొంటాం.

ధనుర్మాసం అంతా ముగ్గు లు వేయడం , గొబ్బెమ్మలు పెట్టడం తో కళకళలాడుతుంది. సంక్రాంతి మూడు రోజుల పండగ. మొదటి రోజు భోగి. ఈ రోజు ఉదయమే లేచి వీధి లో వేసే పెద్ద మంటలని భోగి మంటలని అంటారు. సాయంత్రం భోగి పండ్ల పేరంటం లో రేగు పళ్ళు , పువ్వుల రేకలు, చిల్ల ర పైసలు కలిపి చిన్న పిల్లలకు తలమీద నుంచి పోస్తారు.ముతైదువులను ఇంటికి పిలిచి వాయనాలు ఇస్తారు.

సంక్రాంతి ఉత్తరాయణ పుణ్య కాలం. సూర్యుడు మకర రాశి లోకి ప్రవేశించే రోజు. ఇంటి ముందుకు వచ్చి నృత్యంతో మురిపించే హరిదాసు, బుడబుక్కల వారు ఇంటింటికి తిరిగి వారి చ్చిన కానుకలు తీసుకు వెళతారు. వాకిళ్ళు రంగు రంగుల ముగ్గులతో కళకళ లాడుతూ ఉంటాయి. ధాన్య రాసులని పూజిస్తారు.

కనుమ పండగ కర్షకుల పండగ. పశువుల ను కడిగి అలంకరించి పసుపు, కుంకుమ , పూలతో పూజించి పొంగలి నైవేద్యం పెడతారు. పువ్వుల దండలు వేసి , కాళ్ళకు గజ్జలు , మెడకు గంటలు కట్టి ఊరేగిస్తారు.

పల్లె సంస్కృతి , వ్యవసాయ సంస్కృతి కి సంబంధించిన పండగ సంక్రాంతి. మానవ సంబంధాలలో స్నేహానికి తార్కాణంగా నిలిచే పండగ.