Sunday, October 4, 2009

ఆశ

మంద్రంగా - శీతాకాలపు సాయంత్రాలలో వీచే చల్లని గాలుల్లా , శరద్రాత్రులలోని లేత వెన్నెలవలె, ప్రాతః కాలపు పిల్ల తెమ్మెరలా, ఆకాశంలో ఎగిరే పక్షిలా, మంచులో తడిసిన గులాబీ పువ్వులా, చీకటిలో ఎగిరే మిణుగురు పురుగులా, చెట్ల కొమ్మల మధ్య నుంచి కూసే పిట్టలా, అర్ధరాత్రి తోట మధ్యలోని నిశబ్ద సంగీతంలా మారిపోవాలని ఆశ.

Saturday, October 3, 2009

కలలు

క్రమశిక్షణ , ఆశ వున్నప్పుడు మనసు మిత్రునిలా సహాయం చేస్తుంది.
నిరాశకు లోనైన మనసు శత్రువులా వ్యవహరించి జీవితాన్ని నాశనం చేస్తుంది.
గుండెలోతుల నుంచి ఆలోచించేవారికి లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. పైపైన ఆలోచించేవారు కలలు మాత్రమే కంటారు. తరచి చుడగాలిగినవారు మేల్కొని వాటిని నిజం చేసుకొంటారు.

చదువు ఒక్కటే పరమార్ధం కాదు. పరిశీలన, తార్కికత, నిబద్దత, పట్టుదల, క్రమశిక్షణ వుండాలి. అప్పుడే పైకి రావడానికి అవకాశంతో పాటు విజయం వరిస్తుంది.
ఎప్పుడైతే క్రమశిక్షణ , కృషి సమపంధలో ఉంటాయో అప్పుడు మన గమ్యం సాధిస్తాం. మన ఆశయదిరోహణలో ఒక క్రొత్త ఒరవడిని సృష్టిస్తాం.
ఎప్పుడు చలాకీగా, హుషారుగా వుండేవారు నిరాశ నిసృహలకి దూరంగా వుంటారు.

ఒకసారి మన కలలు నిజమైపోయాక చుట్టూ ప్రపంచాన్ని జాగ్రత్తగా గమనించాలి. మన ఆలోచనలని ఎప్పటికప్పుడు పదును పెట్టాలి. చేసే పని సృజనాత్మకంగా కనిపించాలి, వుండాలి. అన్ని సాధించేసాను అని అనుకొంటే అక్కడితో మనం ఆగిపోతాం . నిరంతర సాధన మనకి కీర్తికిరీటాలు సంపాదించి పెడుతుంది.

Friday, October 2, 2009

ఉత్తరం

ఒక మిత్రుడో/ మిత్రురాలో ఉత్తరం రాస్తే అది చేరడానికి కొన్ని రోజులు, తిరిగి మనం ఒకొక్క వాక్యమే పేర్చుకొంటూ జాబు రాస్తే మరికొన్ని రోజుల్లో వాళ్ళకందేవి.

మళ్లీ ఉత్తరం కోసం ఎదురుచూడడం అందులో మనకోసం అమరిన అక్షరాలు , మనల్ని ఉద్దేశించిన భాష , మనం లక్ష్యం గా సాగిన భావన ఎంత వింతైన అనుభుతిలిస్తాయోకదా !

పాతవి అప్పుడప్పుడు చడువుకోవడంలో ఎంత ఆనందం ఉండేది.
ఇప్పుడు అంతా ఫోనులూ, దాని నుండే సందేశాలు. ఎదురు చూడడం లేదు. సమయం లేదంటూ చాలా కోల్పోతున్నాం.



Tuesday, September 15, 2009

మానవ సంబంధాలు

మన వల్ల పొరపాటు జరిగినప్పుడు క్షమించమని అడగటం , మరొకరి వల్ల మనం మేలు పొందినప్పుడు కృతఙ్ఞతలు చెప్పడం కద్దు.

మనం థాంక్స్ , సారీ అలవాటు చేసుకోన్నాం. భాష ఏమిటన్నది మనసులో పెట్టుకోకుండా భావాన్ని వ్యక్తం చేయడం వల్ల మానవ సంబంధాలు మెరుగు పర్చుకోన్నవాళ్ళం అవుతాం . ఇందులో ఏమాత్రం సందేహం లేదు.

థాంక్స్, సారీ అన్న రెండు పదాలు ఎంత శక్తివంతమైనవో ఎంతోమందికి తెలీదు. అంతే కాదు మానవ సంబంధాలు మెరుగు పరచడంలో ఈ రెండు పదాలు చాల దోహదపడతాయి.

Sunday, September 6, 2009

మాట్లాడం ఒక కళ

కొంతమంది మాట్లాడుతుంటే ఎంత సేపు విన్న తనివి తీరదు. వారి మాటలు ఇంకా ఇంకా వినాలనిపించేంత ఆసక్తికరంగా, మధురంగా ఉంటాయి. చక్కని పదాలు ఉపయోగించడం , సులువైన వాక్య నిర్మాణం , సరైన ఉచ్చారణ కలిగి ఉండటం వీరి ప్రత్యేకత.

భాష మీద పట్టు , మాట్లాడుతున్న అంశంపై అవగాహన, ఆకట్టుకొనేలా మాట్లాడే తీరు చూసి ఎదుటి వ్యక్తులు ముచ్చట పడతారు.

వీరి మాట్లాడే తీరు గురుతుకొచినప్పుడు అసంకల్పితంగా చిరునవ్వు కదులుతుంది.

ఆసక్తికరంగా , వినసొంపుగా మాట్లాడం ఒక కళ . కొందరికి స్వతః సిద్దంగా వస్తే మరి కొందరికి సాధనతో అలవరచుకొంటారు.

మనం అలా మాట్లాడలేకపోతున్నందుకు బాధ పడతాం. కానీ కొంచెం సాధన చేస్తే మనం కూడా అలా మాట్లాడవచ్చు . సహనంతో వ్యవహరించడం, ఆలోచనలలో సమయస్పూర్తి కలిగి ఉండటం, వివరించడంలో స్పష్టత , విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం , భాష మీద పట్టు సాధించడం , కంఠధ్వని మెరుగుపరచుకోవడం వల్ల వినసొంపుగా మాట్లాడవచ్చు.

Sunday, August 30, 2009

గులాబీ

ఆకు పచ్చ ఆకుల మధ్య హుందాగా ఆందంగా ఉంటుంది గులాబీపువ్వు. కానీ ఒంటరిది. ఇతరులకి మానసికానందాన్ని ఇస్తుంది. మనకి అర్ధం చేసుకోగల శక్తి ఉంటే దాని మౌన భాష లో చాల విషయాలు చెబుతుంది.

మనం ఎవరికైనా శుభాకాంక్షలు చెప్పడానికి , అబినందనలు తెలుపడానికి ఒక గులాబీ గుత్తి ఇస్తాం . అది అందుకొన్న వారు ఒక్క క్షణం తదేకంగా దానిని చూసి చిరునవ్వు తో మనని పలకరిస్తారు . ఇష్టపడే వాళ్ళైతే ఆ పువ్వులు చెప్పే ఊసులు నిశ్శబ్దం గా విని ఆనందిస్తారు.

Saturday, August 29, 2009

వర్షం

కమ్ముకొచ్చేమబ్బులు , కురవాల వద్దా అని మేఘాలు ఆడే దోబూచి ఆటలు, ఒక చినుకు తో వర్షం మొదలవుతుంది. వర్షం తో వచ్చే మట్టి వాసన, కిటికిలోంచి ఆకాశం చూస్తుంటే ధారలుగా కురిసే జల్లు , చిన్నపుడు ఆ వానలో కాగితాలతో పడవలు చేసి ఆడుకొన్న ఆటలు, వాన వాన వల్లప్ప అంటు తడిసి తర్వాత జలుబు చేస్తే అమ్మ మెత్తని మందలింపులు , చినుకులు ఆకులపై రాలి ముత్యాల్లా మెరుస్తుంటే వింతగా చూడడం ఏదో కొత్త విషయం కనుకోన్నట్లు , చేలల్లో రైతులు నాట్లు పెడుతూ ఆనందంతో పాడే పల్లె పాటలు వర్షగమనంతో మా పల్లె పచ్చని అందాలు సంతరించుకొంటుంది.